“ఆమె వస్తోంది…ఇళ్ల లోంచి బయటకు రాకండి…” ఇదీ హైదరాబాద్‌ పాతబస్తీలో స్థానికులకు పోలీసులు చేస్తున్న సూచనలు. వస్తున్నది ఎవరు?ఆమె వస్తుంటే వీరు తమ ఇళ్లల్లోంచి కాలెందుకు బయట పెట్టకూడదు.? చాలా చిత్రమైన ఈ పరిస్థితి వివరాల్లోకి వెళదాం…
             ఇవాంకా ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడి గారాల పట్టి, సహాయకురాలు, స్వయానా ఫేమస్‌ బిజినెస్ వుమెన్, టెలివిజన్‌ సెలిబ్రిటీ. అందుకే యావత్ ప్రపంచం దృష్టి ఆమె పైనే ఉంటుంది. అంత పెద్ద పర్సనాలిటీ గ్లోబల్ ఎంట్రపెన్యువర్స్ సమ్మిట్‌లో భాగంగా హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే ఫెడరల్ బ్యూరో బృందం నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చూస్తోంది. వీరితో పాటు స్థానిక పోలీసులూ కట్టుదిట్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా మాదాపూర్‌ వెస్ట్రిన్‌ హోటల్‌, పాతబస్తీ ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇవాంకా మాదాపూర్‌లోని వెస్ట్రిన్‌ హోటల్‌లో విడిది చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాంకాతో పాటు సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో  ఈ నెల 28 న విందు ఇవ్వనున్నారు. దీనితో ఈ రెండు హోటల్స్‌కు కిలోమీటర్‌ పరిధిలోని జనావాసాలు, కార్యాలయాలు, ప్రజల కదలికల పై పోలీసులు దృష్టి సారించారు. వట్టేపల్లి, ఫలక్‌నుమా, ఫాతిమా నగర్‌, సాదిక్‌నగర్‌, చాంద్రాయణగుట్ట వంటి ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లో స్థానికుల వివరాలు సేకరిస్తున్నారు.  ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంత మంది సభ్యులు ఉంటున్నారు? వారిలో స్త్రీలెంత మంది? పురుషులెందరు? ఎవరు ఏ పనులు చేస్తున్నారు? వారి ఫోన్‌ నెంబర్లు, ఆధార్‌ నెంబర్లు రికార్డ్‌ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విదేశాల్లో ఉన్నారా? వచ్చే ఒకటి రెండు వారాల్లో విదేశాలకు వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? గత రెండు మూడు నెలల కాలంలో కొత్తగా ఎవరైనా అపరిచితులు అద్దెకు దిగారా? అనేది ఆరా తీస్తున్నారు.
అంతే కాదు అపరిచితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వొద్ద అని, బంధువులను కూడా ఈ సదస్సు అయ్యేంత వరకు రావద్దని చెప్పమని స్థానికులకు సూచిస్తున్నారు పోలీసులు. కాలనీల్లో, ప్యాలెస్‌ పరిసర బస్తీల్లో రాత్రుళ్లు ప్రత్యేకంగా స్థానికుల కదలికల పై కన్ను పెడుతున్నారు. వివరాలు సేకరించి వదిలేయటమే కాదు గత మూడు నాలుగు రోజుల నుంచి నిత్యం స్థానికుల ఇళ్ళకు వెళ్లి ఇంట్లో సభ్యులు ఉన్నారా లేదా అనేది రూఢి చేసుకుంటున్నారు. ఇవాంకా వచ్చే రోజు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్యాలెస్‌ పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్‌, చిరు వ్యాపారస్తులకూ ఇబ్బందులు తప్పేలా లేదు. సదస్సుకు మూడు రోజుల ముందే వీరందరిని ఇక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే పోలీసులు విధిస్తున్న ఈ ఆంక్షలను స్థానికులు తప్పుబట్టటం లేదు. విదేశాల నుంచి అంత పెద్ద వ్యక్తులు వస్తున్నప్పుడు భద్రత కోసం చర్యలు తీసుకోవటం మంచిదే అంటున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటామని, పోలీసులకు సహకరిస్తామమని అంటున్నారు. అటు మాదాపూర్‌నూ ఇదే పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ఐటీ ఆఫీసులు, అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశం అయ్యారు పోలీసులు. ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారి ఫోన్‌ నెంబర్లు, వాహనాల నెంబర్లు సేకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు ఎవరు అనే దిశగానూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సదస్సు అయ్యేంత వరకు కత్తగా ఎవరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని కూడా సూచిస్తున్నారు.