అధికార పగ్గాలు అందుకోవటానికి పాదయాత్ర ఓ ఆయుధమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ కుటుంబంలో ఇది మూడో పాదయాత్ర. నవంబర్ ఆరో తేదీన ఇడుపుల పాయలోని తండ్రి సమాధి దగ్గర నుంచి అడుగులు వేసుకుంటూ బయలు దేరారు వైఎస్ జగన్. ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆరు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలను స్పృశిస్తూ ఆయన మూడు వేల కిలోమీటర్లు నడవనున్నారు. దారి పొడవున ఐదు వేల బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత, మత్స్యకారులు వంటి సుమారు 180 విభిన్న వర్గాలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి కష్టాలు, ఇబ్బందులు, అవసరాలు అన్నీ వారి నుంచే ప్రత్యక్షంగా వినే ప్రయత్నం చేస్తారు. వీటన్నింటిని క్రోడీకరించి ప్రజా మ్యానిఫెస్టోను తయారు చేస్తానన్నది జగన్‌ చెబుతున్న మాట. అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టిస్తారు. అయితే అసలింత వరకు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయని వ్యక్తే లేరా అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి రాజకీయ నాయకురాలిగా వ్యవహరించకపోయినా, జగన్ సోదరి వైఎస్‌ షర్మిలా మూడు వేల మార్క్‌ను నాలుగేళ్ల క్రితమే ఛేదించారు. క్విడ్‌ప్రోకో ఆరోపణల పై జగన్‌ జైల్లో ఉండటంతో పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత, నైరాశ్యం రాకుండా చూడాల్సిన బాధ్యత అప్పట్లో జగన్‌ చెల్లెలు భుజస్కందాల పై నే పెట్టారు. ఆమె కూడా “రాజన్న బిడ్డను, అన్న వదిలిన బాణాన్ని ” అంటూ జగన్‌కు ప్రతినిధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చుట్టేశారు. 2012లో ఇడుపుల పాయ నుంచే ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం యాత్ర 230 రోజుల పాటు కొనసాగింది. కాలి మడమకు గాయం కావటంతో శస్త్రచికిత్స, అనంతర విశ్రాంతి వల్ల ఆరువారాలు మధ్యలో యాత్రకు బ్రేక్ పడింది. మొత్తం మీద జూలై19, 2013న 3వేల 112 కిలోమీటర్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకుని యాత్రను ముగించారామె. ఒక మహిళగా ఈ యాత్ర కూడా రికార్డ్ గానే చెప్పాలి. ఆంధ్రనాట ఏ మహిళా ఈ స్థాయిలో పాదయాత్ర చేయలేదు.

పాదయాత్రలు, వాటి చుట్టూ ఉండే రాజకీయాలు అర్ధం చేసుకోవాలంటే మరింత వెనక్కి వెళ్లాల్సిందే. 1989లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్ నగరంలో ప్రజా సమస్యల పై పాదయాత్రలు చేసే వారు. అయితే
విజయవంత పాదయాత్ర ఫార్ములాకు బీజం వేసింది దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అనే చెప్పాలి. ఇప్పటికీ పాదయాత్ర అంటే ఆయన చేసిన “ప్రజా ప్రస్థానమే” గుర్తుకు వస్తుంది. 2003 మండుటెండల్లో 55 ఏళ్ల వయస్సులో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేశారాయన. ఈ మొత్తం ప్రయాణం పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా వైఎస్‌కు తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు కొనసాగటానికి ఈ యాత్ర ఓ పునాదిగా పని చేసింది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి వ్యవసాయానికి ఊతం ఇచ్చే పథకాల ప్రకటనకు యాత్ర సమయంలో రైతులతో మమేకం కావటం ద్వారానే రాజశేఖర రెడ్డి స్ఫూర్తి పొంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా పేరు సంపాదించుకున్న వైఎస్‌లో పాదయాత్ర తర్వాత చాలా మార్పు వచ్చిందంటారు ఆయన సన్నిహితులు. కోపం, అసహనం, ఆవేశం స్థానంలో పరిపక్వత, వ్యూహాత్మకత, సంయమనం ఆయన వంటబట్టించుకున్నారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో మమేకం కావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పార్టీ పై గట్టి పట్టు వచ్చింది. ఇది తర్వాతి కాలంలో తనకు లానే మరో అసమ్మతి వాది గళం విప్పకుండా చేసుకోవటానికి ఉపయోగపడింది.
వైఎస్ తర్వాత సరిగ్గా పదేళ్ళకు అదే పాదయాత్ర ఫార్ములాను అనుకరించి అధికారంలోకి వచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. బాబు దగ్గరకు వచ్చే సరికి వయస్సు ఎక్కువ అయ్యింది. 62 ఏళ్ల వయస్సులో 2వేల 500 కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకున్నారాయన. వయస్సు దృష్ట్యా చూస్తే ఇది ఒక సాహసోపేత నిర్ణయమే. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి “వస్తున్నా మీ కోసం”…అని బయలుదేరారు. అప్పటికి టీడీపీ అధికారానికి దూరమై పదేళ్ళు అవుతుండటం, రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో సీఎమ్‌ కుర్చీ అవసరం ఆయనకు ఎక్కువగా ఉండింది. 117 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో బాబు కార్యకర్తలు, ప్రజలతో మాటా మంతీ చేస్తూ , వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిపోయారు. పార్టీ పవర్‌లోకి రావటానికి కారణమైన వ్యవసాయ రుణాల మాఫీ ప్రకటన పాదయాత్ర సందర్భంగానే చంద్రబాబు చేశారు. పవన్‌ కళ్యాణ్ , మోడీ ప్రభావాలు కలిసి వచ్చినా పాదయాత్ర పాత్ర కూడా పరిగణలోకి తీసుకోతగిందే అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. పాదయాత్రల ద్వారా హక్కులు సాధించుకోవటం అనేది నాగరిక చరిత్రలో స్థిరపడిన విధానమే. ఒక్క మాటలో చెప్పాలంటే నిరసనకు ఇదో బలమైన రూపం. మహాత్మాగాంధీ చేసిన దండీ మార్చ్ దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బలమైన అంశం.1939 మార్చి 12న అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమై ఏప్రియల్ 6న తీర్ ప్రాంతమైన దండి గ్రామంలో ముగిసింది. గాంధీ 78 మంది అనుచరులతో 390 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఉప్పు పై పన్ను విధానాన్ని నిరసిస్తూ. ఉపాధి అవకాశాల కోసం వాషింగ్టన్ డీసీ పై 1963 ఆగష్టులో మార్టిన్ లూధర్ కింగ్ నేతృత్వంలో జరిగిన పాదయాత్ర, ర్యాలీ చరిత్రలో నిలిచి పోయాయి. దీనితో పాటు ఈ యాత్ర సందర్భంగా నాకూ ఒక కల ఉంది అని మార్టిన్ ఇచ్చిన ఉపన్యాసం కూడా చారిత్రత్మకమై నిలిచింది. ప్రపంచంలోనే సుదీర్ఘ పాదయాత్రగా చరిత్ర సృష్టించింది మావో జెడాంగ్ నేతృత్వంలో ఎర్రదండు చేసిన పాదయాత్ర. 1934 అక్టోబరు 16న చైనాలోని గ్సియాగ్సిలో మొదలై 9వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ మరుసటి ఏడాది 22 అక్టోబరు న షాంక్సిలో ముగిసింది.

మళ్లీ మనం వైఎస్‌ జగన్‌ దగ్గరకు వస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ పెట్టక ముందు నుంచీ ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలను ఎంచుకోవటంలో ఆయన ముందున్నారు. వైఎస్‌ మరణ వార్త విని తట్టుకోలేక గుండె ఆగిన కుటుంబాలను పరామర్శించటానికి ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించటం జగన్‌ మొదటి ప్రణాళిక. ఈ ఓదార్పు యాత్ర, ప్రజా స్పందన చూసే కాంగ్రెస్‌ అధిష్టానం పొమ్మనకుండా పొగబెట్టి జగన్ ను పార్టీ నుంచి బయటకు పంపిందనే వాదన కూడా ఉందనుకోండి. ఏమైతేనేం మడమ తిప్పని నేతను అంటూ ఆయన ఓదార్పు యాత్రను కాంగ్రెస్ ను వీడి న తర్వాత కూడా కొనసాగించారు. నిరాహార దీక్షలు, ధర్నాల వంటి నిరసన కార్యక్రమాలను వివిధ సందర్భాల్లో చేసినా ఈ పాదయాత్ర పై పార్టీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. తండ్రి బాటలో పాదయాత్ర చేస్తున్న కుమారుడికి అదే రీతిలో విజయం వరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పాదయాత్ర సెంటిమెంట్ ఫలించి అధికార పగ్గాలు వచ్చేస్తాయని గుడ్డిగా అనుకోవటానికీ లేదు ఎందుకంటే…వైఎస్‌ హయాంలో రాజకీయ పరిస్థితులు వేరు. అదే విధంగా చంద్రబాబు పాదయాత్ర చేసిన నాటి సమస్యలు వేరు. అయితే అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు పాదయాత్ర చేస్తున్న కాలంలో సీఎమ్‌ కుర్చీలో చంద్రబాబు నాయుడే ఉండటం యాధృచ్ఛికం. అదే విధంగా వైఎస్‌ ప్రజాప్రస్థానం నాటికి టీడీపీ 9, 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ ఉండింది. సహజంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. అలానే చంద్రబాబు పాదయాత్ర నాటికి చూస్తే కాంగ్రెస్ రెండో దఫా రాజ్యం ఏలుతూ ఉంది. పైగా అడ్డగోలుగా, అన్యాయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసి తమను నడిరోడ్డున పడేసిందన్న ఆగ్రహంతో సీమాంధ్ర ప్రజానీకం రగిలిపోతూ ఉంది. ఇవి టీడీపీకి అనుకూలించాయి. ఈ పరిస్థితులను అంచనే వేస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ వయస్సు గట్టిగా మూడున్నర ఏళ్లు. ప్రభుత్వ వ్యతిరేకత అంత బలంగా కూడా ఉన్నట్లు కనిపించటం లేదు. ఎంతో కొంత ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటానికి జనసేన అస్త్రం బాబు చేతిలో ఉండనే ఉంది. వీటన్నింటితో పాటు ముఖ్యంగా జగన్‌ పై అవినీతి ఇమేజ్‌ చెరిగిపోలేదు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వకపోవటంతో పాదయాత్ర సమయంలోనూ జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇటువంటి పరిణామాలు చదువుకున్న వర్గం పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇటువంటి సవాళ్ళను జగన్ ఎలా అధిగమిస్తారు అనేది మరికొంత కాలం ఆగితే గాని తెలియదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నా…ఈ సుదీర్ఘ పాదయాత్ర జగన్‌ను మరింత పరిపక్వ రాజకీయ నాయకుడిగా తయారు చేస్తుంది. ప్రజా సమస్యలను దగ్గరగా చూడటం, అన్ని వర్గాల వారితో మమేకం కావటం ఏ రాజకీయ నాయకుడికి అయినా విలువైన అనుభవాల్ని ఇస్తుంది.

Views expressed in the article are author’s personal.