పవర్ కు దగ్గరగా ఉంటే పదవులు వస్తాయనే ఫార్ములాను తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది జర్నలిస్టులు వంటబట్టించుకోవటం లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. జర్నలిజానికి అర్ధం మార్చేసి అభిమాన నేతాజీల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. ప్రతిఫలంగా నామినేటెడ్ పోస్టులు సొంతం చేసుకుని కొత్త అవతారాల్లో దర్శనమిస్తున్నారు. ఈ ధోరణి ఇప్పుడే ఇక్కడే కొత్త కాకపోయినా పదవుల కోసం పోటీపడుతున్న జర్నలిస్టుల సంఖ్య ఈ మధ్య పెరిగిందనేది వాస్తవం తాజా పరిణామాలను బట్టి ఇట్టే అర్ధం అవుతుంది.
         ఈ మధ్య కాలంలో తెలంగాణా రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవి అనూహ్యంగా బుద్ధా మరళికి దక్కింది. సుదీర్ఘ కాలం ఆంధ్రభూమిలో పని చేసిన ఈయనకు సబ్జెక్ట్ కంటే కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యమే పదవి వచ్చేలా చేసిందనేది ఆయన సన్నిహితుల టాక్.
అల్లం నారాయణ తెలంగాణా ప్రెస్ అకాడమి ఛైర్మన్ అయ్యారు. దాని కంటే ముందు కేసీఆర్ కు చెందిన నమస్తే తెలంగాణాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ కే చిందిన టీ న్యూస్ నుంచి మెట్లు పైకెక్కి సీఎమ్ కోటరీలో స్థానం సంపాదించుకున్న గటిక విజయ్ కుమార్ కూడా ఇదే క్యాటగిరీ. తాజాగా ట్రాన్స్ కోలో ఉన్నత పదవి దక్కింది ఈయనకు. మరో జర్నలిస్ట్ వనం జ్వాలా నర్సింహా రావు కూడా ఇప్పుడు సీఎమ్ చీఫ్ పీఆర్ఓ.
         అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే వైఖరి జర్నలిస్టుల్లో ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ బీట్ చూసిన
పలువురు రిపోర్టర్లు ఇప్పుడు మంత్రుల దగ్గర పీఏలు హడావిడి చేస్తున్నారు. పనిలో పనిగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు అనే ప్రచారం ఉంది. తెలంగాణాను ఫాలో అయిపోతూ ఇక్కడ కూడా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమయ్యిందని సమాచారం.  తాజాగా నోటిఫకేషన్ విడుదల చేసిన ముగ్గుర సభ్యుల సహ చట్టం కమిషనర్ పోస్టుల్లో ఇద్దరి పేర్లు దాదాపు ఖాయం అయ్యాయి. వారిలో ఈనాడు ప్రతినిధి ఒకరు కాగా, ఆంధ్రజ్యోతి చానెల్ లో విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న రామారావు మరొకరని సమాచారం. ఈ రెండు వార్తా సంస్థలు టీడీపీ గెలుపుకు బాకా కొట్టేవే. స్టింగర్ నుంచి కెరీర్ ప్రారంభించిన వెంకట కృష్ణ అనే ఓ జర్నలిస్ట్  ఏపీ టైమ్స్ పేరుతో చానెల్ ప్రయత్నాల వెనుక కొందరు టీడీపీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం ఉంది. అన్నింటికి మంచి మూడు నాలుగేళ్ల క్రితం వరకు 15, 20 వేల జీతానికి సాధారణ రిపోర్టర్ గా ఉన్న మారెళ్ల వంశీక్రుష్ణ ఇప్పుడు ఏకంగా ఓ ఛానల్ కు ఎమ్ డీఅయిపోయారు. టీడీపీ కార్యకర్త కంటే అంకిత భావంతో ఎల్లో జర్నలిజానికి కేరాఅఫ్ అడ్రస్ గా మారారు అని ఆయన సహచరులే చెప్పుకుంటున్న పరిస్థితులు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రాపకం కూడా సంపాదించారాయన. అసలు ప్రభుత్వంలో బదిలీలు, కాంట్రాక్ట్ లు వంటి వ్యవహారాలు అవ్వాలంటే ఎమ్మెల్యేలు కూడా ఈయనకు డబ్బులు చదివించుకుని పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉందంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేనే మహాటీవీని కొని ఆ ఛానల్ ద్వారా టీడీపీ ప్రచారా బాధ్యతలు వంశీ చేతిలో పెట్టారనేది అమరావతి టాక్. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహత్యం వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఖాయం అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
        అటు రాజకీయ నాయకులకు కూడా ఇటువంటి కరుడుగట్టిన జర్నలిస్టులు తమ చుట్టూ ఉంటే మరింత భద్రత ఉంటుందనే భావనలో ఉన్నారు. తప్పులు, అక్రమాలు బయటకు రావు. ఔత్సాహిక జర్నలిస్టులు ఎవరైనా నాయకుల లోతుపాతులు తవ్వే ప్రయత్నం చేసినా విషయం బయటకు పొక్కకుండా, ప్రజలల్లో వెళ్లకుండా, మీడియాలో రాకుండా ఈ కవర్ జర్నలిస్టులే చూసుకుంటారు. పైగా మీడియాలో కవరేజ్ ఏ రేంజ్ లో ఉండాలో వీరే స్క్రిప్ట్ రెడీ చేస్తారు. అలా ఫోటోలకు ఫోజులో,టీవీ కెమెరాల ముందు కాస్త యాక్షనో చేస్తే చాలు విషయాన్ని హెలెట్ చేసే బాధ్యత వీరు తమ భుజ స్కందాల పై వేసుకుంటారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతున్న ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో.